Showing posts with label నా జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label నా జ్ఞాపకాలు. Show all posts

Jun 25, 2012

సింగరేణి పండుగలు


ఇక పండుగల విషయానికి వస్తే మాములుగా అందరు జరుపుకునే ఉగాది నుండి దసరా వరకు పండుగలు పోను కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి పోశమ్మ బోనాలు, సైడ్ పిల్ల, చెట్ల తీర్థాలు(వన బోజనాలు), రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క జాతర, జెండా వందనం(మాకు స్వాతంత్ర్య దినం,గణతంత్ర దినం అని విడిగా తెలియవు ఏదైనా సరే అది మాకు జెండా వందనం అంతే)

పోశమ్మ బోనాలకి,చెట్ల తీర్థానికి మేము అడక్కండానే మా వాళ్లు మమ్ముల్ని బడి ఎగ్గోట్టమనే వాళ్లు. ఈ పండుగలు రెండు రకాలుగా జరుగుతాయ్, ఒకటి ఎవరికీ వారే, ఇంకోటి గుంపుగా. అది ఎలాగంటే పోశమ్మకి ఎవరికీ వారే విడిగా ఇంట్లో ఒకసారి చేస్కుంటారు మల్లి అందరితో పాటుగా ఒకసారి అందరు కలిసి పోశమ్మ గుడికి వెళ్లి ఉత్సవం చేస్తారు. ఇలాగె సమ్మక్క జాతర కూడా. పోశమ్మ గుడిలో బట్టతో కుట్టిన చిలకలు కట్టే పద్ధతి ఉండేది, ఆరోజు నాకొకటి అంటే నాకొకటి అని చాల మంది మా ఇంటికి వచ్చే వాళ్ళు.. ... చెట్ల తీర్తాలకైతే ఇంటి దగ్గర సైడ్ పిల్ల అని వాడంత కలిసి ఒక మేకని బలి ఇచ్చి, ఇది సరిపోక రెండు మూడు వారాల తర్వాత చెట్లతీర్థం అని దగ్గర ఉన్న చిట్టడివికి వెళ్లి ఇంకో మేకని బలి ఇస్తారు. ఈ బలులు ఇంతటితో ఆగవు...బాయి మీద మైసమ్మ అనే పేరుతో కూడా బలులు ఇస్తారు...

భయంతోనో, భక్తితోనో, ఆచారం పేరుతోనో ఇవి జరుగుతూనే ఉంటే... ఇవి కాక ఎవరికి ఎప్పుడు మాంసం తినాలి అనిపిస్తే అప్పుడు ఇంకేదో దేవుడో, దయ్యమో గుర్తుకు వచ్చి మల్లి ఇంకో మూగ ప్రాణిని బలి చేస్తారు...సర్లెండి ఈ బలుల గురించి వదిలేద్దాం కాసేపు...చెట్ల తీర్థం గురించి చెప్పుకుందాం..

పట్నం లో అయితే వన బోజనాలు అంటారు, మేము మాత్రం చెట్ల తీర్థం అనే అంటాం.

బాగ్యనగరం బోనాల మాదిరిగానే ఉన్నా మా సంబరంలో కొంచెం తేడా ఉంటుంది.

చెట్ల తీర్థం వెళ్ళే ఉదయమే ఇంట్లో పిండి వంటలు చేస్తారు..పిండి వంటలు అంటే పిండి తో చేసే వంటలు...క్షమించాలి, వంటలు కాదు వంట మాత్రమె. ఎందుకంటే ప్రతి ఇంట్లో విధిగా పూరి మాత్రమె చేసే వాళ్ళు.

మసాలాలు, బియ్యం, పూరీలు, పళ్ళాలు, వంటకు కావాల్సిన సామగ్రి అంత ఒక గమాలలో(గంప) వేసుకుని, దాని మీద సున్నం గీతలు గీసి, వాటి మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టి, ఆడవాళ్ళూ ఆ గంప నెత్తిన పెట్టుకుని బయల్దేరేవాళ్ళు.. మేము సైకిల్ మీద కట్టెల మోపు, బింద, మా అమ్మ మోయలేక వదిలేసినవి తీస్కుని వాళ్ళ ముందే వెళ్ళే వాళ్ళం, మా అందరి కంటే ముందు, సపరివార సమేతంగా అన్నట్టుగా, తనకేదో ఊరేగింపు చేస్తున్నారు అన్నట్టుగా రాజసంగా బలిచ్చే మేక కదిలేది...”గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టు...”.

ఆరోజంతా ఊరు మొత్తం ఊర్లో కాక అడవిలో ఉండేది... అందరు చెట్ల తీర్థంకు వస్తారు కాబట్టి మాకు స్థలం దొరకడం కొంచం కష్టమయ్యేది.. కాని అడవి తల్లి విశాల హృదయంలో మాకు ఎప్పటికి చోటు ఉండేది. మా వాడ గుంపు అంతా అడవిలో ఏదో వైపు ఆక్రమించుకునే వాళ్ళం..ఏదో ఒక చెట్టు కింద మా గంపలు పెట్టేసి.. ఎండ పడకుండా పందిరి వేసుకుని.. దాని మీద ఆకులతో కప్పేసే వాళ్ళం...పిల్లల హంగామా చూడాలి... ఒకరి కొత్త ఇల్లు ఇంకకరికి చూపిస్తూ సందడి చేసే వాళ్ళు..గుంపుగా బయలుదేరి అందరి ఇళ్లను సర్వే చేసేవాళ్ళు...బహుమతులు ఎం ఇవ్వక పోయినా, ఉత్తమ గృహం అవార్డును మాత్రం ఎవరికో ఒకరికి ఇచ్చే వాళ్ళం...

కాసేపయ్యాక సీతాకోక చిలుకల్ని,బంగారు పురుగుల్ని పట్టుకోవడం లేకపోతే సంప్రదాయ బద్దంగా ఒలంపిక్స్ నిర్వహించే వాళ్ళం. గూటి బిల్లాగోలీలు, సీకులు, దొంగ పోలీసు, కరెంటు షాక్, ఔటిచుకునుడు, ఇవన్న మాట..నేను అన్నిట్లో ప్రథమ స్థానం(చివరి నుండి)..

మగవాళ్లంత బలిని సిద్దం చేసి, పోగులు పెట్టేంత వరకు వాళ్ళ బిజీ లో వాళ్ళు ఉంటారు.

పొయ్యి రాళ్ళు వెతికి తేవడం, దగ్గర ఉన్న బొగ్గు గని దగ్గరికి వెళ్లి నీళ్ళు తీస్కురావడం మా పనులు. ఈ రెండు పనులు మాకు నిధి అన్వేషణతో సమానం. ఆరోజు అందరికి అవసరం కాబట్టి పొయ్యి రాళ్ళు దొరకడం కష్టం. ఎక్కడో దూరం నుండి చూసి ఆ రాయి నాదంటే నాదని కోట్లడుకునే వాళ్ళం. కొన్ని సార్లు సగం భూమిలో పాతుకు పోయిన రాళ్ళని పెకిలించి తెచ్చేది. పొయ్యిని పుదుచ్చి(తయారు చేసి, పూజించడం), ఆడవాళ్ళంత అన్నం వండేసి, మాంసం రాగానే దాన్ని వండడం మొదలు పెడతారు. అందరు ఏదో ఒకటి మరిచిపోయే వాళ్ళు.. కొందరు నూనె తెచ్చుకోవడం, కొందరేమో ఉప్పు,కారం తెచ్చుకోవడం మరిచిపోయేవాళ్ళు. ఉన్న వాటిలో అందరు కలిసి సర్దుకు పోయి మొత్తం మీద వంట పూర్తి చేసే వాళ్ళు. వంట మద్యలో అప్పుడప్పుడు వర్షం కురిసేది. మేము వేసిన పందిరి బలంగా ఉంటె మా వంటకి ఎటువంటి ఆటంకం రాకపోయేది, లేకపోతే వేరే వాళ్ళ పందిరిలోకి దూరే వాళ్ళం. ఒక సారయితే ఇంటికి వచ్చేసి వండుకన్నాం. గొడుకు పట్టి వంట చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. వానలో మంటలు..ఆ మంటల మీద వంటలు..ఈలోపు మేము వెళ్లి, సంవత్సరానికి ఒక సారి మాకు మంజూరు అయిన కూల్ డ్రింక్స్ తెచ్చుకునే వాళ్ళం. ఇంట్లోకి ఎవరైనా బందువులు వచ్చినపుడు మాత్రమె కూల్ డ్రింక్స్ తెచ్చేవాళ్ళు.. అది కూడా బంధువులకి మాత్రమె. మాకు ఒక చిన్న గిలాస(గ్లాస్) లో పోసి తాగడానికి ఇచ్చేవాళ్ళు. కాని ఈరోజు మాత్రం మొత్తం సీసా మాకే. పెద్దవాళ్ళంత వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్ తెచ్చుకునే వాళ్ళు. పిల్లలందరం బోజనాలు చేయడానికి టేకు ఆకులూ తెచ్చుకునే వాళ్ళం.

 ఇక బోజనాలు మొదలు...వచ్చే సారి మీరు అల్లుడితో రావాలి అంటే మీరు మనవడితో రావాలి అంటూ చమత్కారాలు విసురుకోవడం చేసేవాళ్ళు.  ఈ ఇంటి వంట ఆ ఇంటికి, ఆ ఇంటి మందు ఈ ఇంటికి....పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తూ ఎంతో ఆనందంగా బోజనాలు అయ్యేవి..మన కుటుంబం అంటే మన ఇంటికి మాత్రమె పరిమితం కాదు అనిపించే విధంగా ఉండేది. నిజంగా ఆ ఆనందం వెలకట్టలేనిది.
బోజనలయ్యాక అందరు లేవలేక లేస్తూ...నడవలేక నడుస్తూ.. వెళ్ళలేక వెళ్ళేవాళ్ళు...
మధుర క్షణాల్ని దూరం చేస్కోలేక కాదు సుమండి..చాలా మందికి తాగింది దిగక, కొంతమందికేమో తిండి ఎక్కువయ్యి, అదేలెండి భుక్తాయాసం.
కొందరు చిన్న పిల్లలైతే “ఈ కొత్త ఇల్లు బాగుంది అమ్మ!! ఇక్కడే ఉండిపోదాం” అంటూ మారాం చేసే వాళ్ళు.
దొరికిందే అదనుగా, మాకు ఎవరి మీదైతే పగ తీర్చుకోవడానికి ఏళ్లుగా ఎదురు చూస్తున్నామో, వాళ్ళ టైర్లలో గాలి తీసే వాళ్ళం. తర్వాత వాళ్ళ బాధ చూసి పాపం అనుకునే వాళ్ళం. ఇవ్వాల ఆడిన ఆటలకు, తిరిగిన తిరుగుడుకు మాకు కాళ్ళు నొప్పులు పుట్టేవి...
hmm…రేపు కూడా బడి బంద్!!! J J

మా జెండా పండుగ


మా వాడలో ప్రాణహాని జరుపని పండగ జెండా వందనం...చదువు లేని వాళ్లైన వాళ్ళ దేశభక్తి చాలా గొప్పది. జెండా ఎగురవేయడం మన బాధ్యతగ బావించేవారు.ప్రతి సంవత్సరం రెండు సార్లు జరుపుకుంటాం....రెండు రోజుల ముందు నుండే అభిప్రాయ సేకరణ మొదలు పెడతారు... ఎలా జరపాలి, ఎంత మంది అందులో పాల్గొంటారు అని. ప్రతి ఇంటికి వెళ్లి మేము జెండా వందనం జరపాలి అనుకుంటున్నాం అని ఆ వాడ పెద్ద  చెప్పెసేవాడు. ముందు రోజు రాత్రంతా జెండా వందనం జరిపే చోట శుభ్రము చేయడం, దారాలతో రంగుల కాగితాలు అతికించడంతోనే సరిపోయేది. తెల్లవారి మొదలు అవుతుంది ఇక హడావుడి....తరతరాలుగా వేదిస్తున్న ఒక ప్రశ్న అందరి మెదడులలో పుట్టుకొస్తుంది...ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఆ వాడ మీద ఉన్న ఎవరి వల్ల  కాదు...అదో యక్ష ప్రశ్న మాకు...మాకు తెలిసి ఈ ప్రశ్నని సివిల్స్ లో అడుగుతారు...

జెండాలో ఎ రంగు మీద ఉంటుంది? ఎరుపు రంగా? పచ్చ రంగా?

కాసేపు వాదోపవాదాలు, వోటింగ్ ప్రక్రియ అయిపోయాక... దగ్గర ఉన్న బడి దగ్గరికి వెళ్లి వాళ్ళు ఎలా పెట్టారో అలాగే పెట్టేవాళ్ళు....

ఇక తర్వాతి సమస్య.... ”జన గణ మన....” .

నాకు నిజంగా రామదాసు గుర్తుకు వచ్చే వాడు..  “ నా తరమా!! భవ సాగారమీదను!!...”

నాకే కాదు మా వాడ మీద పిల్లలందరికీ అదో మిస్టరీ...ఎవరికీ పూర్తిగా రాదు...

పిల్లలందరం ముందు రాత్రే గొడవ పెట్టుకునే వాళ్ళం,... నువ్వు చదువు అంటే నువ్వు చదువు అని. గతంలో వాళ్ళు నాకు చేసిన సహాయం గుర్తు చేసి... నా వంతు వచ్చే వరకు మరీ బొమ్మ బొరుసు వేసి ..అందరు కలిసి నన్ను ఇరికించే వారు. నేను ముందు రాత్రి ఒక సారి, ఆరోజు ఉదయం ఒకసారి బట్టీ వేసేవాడిని...అదేంటో అందరితో కలిసి పాడితే అనర్గళంగా వస్తుంది... విడిగా  పాడితే మాత్రం మద్యలో ఎక్కడో పోతుంది. ఎలాగు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ రాదు కాబట్టి...నేను తప్పు పాడిన ఎవరు ఏమి అనే వాళ్ళు కాదు.. చివర్లో “జై హింద్!!!” అని మాత్రం గట్టిగా అనే వాడిని.... అందరు జై హింద్!! అని చెప్పేసి.. నాకు మాత్రం అందిరికన్నా రెండు చాక్లెట్లు ఎక్కువ ఇచ్చే వాళ్ళు... ఒక వేళ మా వాడ మీద పిల్లలందరూ ఆ రోజు బడికి వెళ్తే, బళ్ళలో జెండా వందనం అయిపోయే వరకు అందరు ఎదురు చూసే  వాళ్ళు..ఎ బడి ముందు విడిచి పెడితే ఆ బడి పిల్లల్ని దొరకపుచ్చుకొని మరీ జన గణ మన పాడించే వాళ్ళు....ఇది ముందే కనిపెట్టే కొందరు పిల్లలు అటు నుండి అటే పారిపోయేవాళ్ళు...

Jul 23, 2011

పరీక్షా సమయం......నాకు కాదు మాష్టార్లకి.


నా జీవితం లో మొట్ట మొదటి పరీక్ష అది... అగ్ని పరీక్ష కాదు... U.K.G. పరీక్ష....ముందు రాత్రి చాల కష్టపడి చదివా....

అన్ని రోజుల్లాగే ఆరోజు కూడా తూర్పు దిక్కునే ఉదయించాడు సూర్యుడు....

ప్రశ్నాపత్రం ఇచ్చేసారు.... కష్టమైన ప్రశ్నలు చాలానే ఉన్నాయి...

ఆశ్చర్యం.....సిలబస్ లో లేని ప్రశ్నలు కూడా ఇచ్చారు.... నాకు దిమ్మ తిరిగి పోయింది... గుండె చప్పుడు నాకు తెలస్తుంది... చెమటలు పట్టేసాయ్......దిక్కులన్ని చీకటి అయిపోయాయ్... అందులో ఒక ప్రశ్న...

Q. What is your name?

ఎక్కడో చూసినట్టుగా....   కాదు విన్నట్టుగా ఉంది......

నా చుట్టూ పేరుకు పోయిన చీకట్లలో  కొవ్వత్తి వెలిగింది.... నాకు లీలగా గుర్తువస్తుంది....ఆరోజు మాష్టారు ఒకటో తరగతి వాళ్ళకు చెప్తున్నారూ......

నాకు జవాబు వచ్చేసింది... పట్టలేని ఆనందం నాలో...ఒక్కసారిగా ప్రశ్నాపత్రం చించేసి “హుర్రే!!!!...” అని అరవాలి అనిపించింది.... కాని ఆ గుడ్లగూబ మాష్టారు నా వైపే చూస్తున్నారు....సరే అరవడం ఎలాగు బయటికి వెళ్ళాక అరవచ్చులే అనుకొని...నా ఏకాసంతాగ్రహతకి కి మురిసిపోతూ జవాబు మొదలు పెట్టాను...

మద్యలో... ఎం చేయాలో అర్ధం కాలేదు... చాల కష్టంగా అనిపించింది.... అయిన సరే నాకు పుట్టుక తోనే అబ్బిన తెలివి తేటలు అన్నీ ఉపయోగించి మొత్తానికి పూర్తి చేసాను....

చాల అలసి పోయాను నాకు కొంచం విశ్రాంతి కావాలి.....మాష్టారుకి చిటికన వేలు చూపించి బయటకు వెళ్ళాను...

తిరిగి వచ్చేసరికి మాష్టారు నా పేపర్ చూస్తున్నారు.... మాష్టారు కళ్ళల్లో అనందం.. పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు  కోడికి కలిగే ఆనందం..... చంద్రముఖి కి కాలి గజ్జెలు దొరికినప్పటి పరవశం... మాష్టారు కళ్ళల్లో కనిపించాయ్....అప్పుడే వస్తున్న నన్ను చేతుల్లోకి తీస్కొని గాల్లోకి ఎగిరేసి.... ఓ ముద్దు కూడా పెట్టుకున్నాడు.... నేను చాల గర్వంగా అందరివైపు ఓ చూపు చూసి మిగితా పరీక్షా పూర్తి చేసాను.....

తిరిగి వాళ్ళు దిద్దిన పేపర్లు ఇచ్చే వరకు తెలియలేదు నేను చేసిన ఘనకార్యం ఏంటో అని..... నా పేరు ఇంగ్లీష్ లో రాయడం తెలియక...

MY NAME IS సంజీవ్ “

అని రాసా....

Jul 21, 2011

పరుగో... పరుగు....

ఒకసారి వేసవి సెలవుల్లో మా బావ పెళ్ళికని అత్తమ్మ వాళ్ళింటికి వెళ్ళాము అందరం. తెల్లవారితే పాల పొరక కి వెళ్ళాలి. ఉదయం అవనే అయ్యింది. ఎండ్లబండ్లు సిద్దం అయ్యాయి. మా చిన్నబావ, నేను ఒకే ఎడ్లబండిలో ఎక్కాం. కాసేపటికి ముందుకు కదిలాయి. అలా ఊరి చివరికి వెళ్ళగానే... ఎందుకోనో సందేహం వచ్చి మా బావ ని అడిగా..

“బావ మనం ఎక్కడి వరకు వెళ్తున్నాం...ఇక్కడ ఎక్కడ పాల చెట్టు లేదా?” అని...

 ఇక్కడెక్కడ లేదు పక్క ఊరికి వెళ్ళాలి అని చెప్పాడు మా బావ. మనలో బద్దక రాముడు మేల్కొన్నాడు. ఇప్పుడు అంత దూరం వెళ్ళాల...ఇక్కడే దగ్గరే అంటే ఏదో ఆవేశపడి ఎక్కా గాని అంత దూరం అంటే నేను రాను పో.... అంటూ చక చక బండి దిగేసి...ఇంటి వైపు నడక మొదలు పెట్టాను.....ఇక్కడ కూడా మరో సారి బద్దక రాముడు అడ్డుపడి....

” ఒరేయ్! ఇలా రోడ్డు మీదుగా వెళ్తే చాలా దూరం అలా మద్య దారి గుండా పో! “ అని ఒక దారి చూపించాడు.

అది మొత్తం మైదాన ప్రాంతం..... చుట్టూ చెట్టు చేమలు తప్ప ఏమి లేవు... కనుచూపు మేరలో ఒక్క మనిషి కూడా లేడు.... కాసేపటికి మైదాన ప్రాంతం మద్య లోకి వచ్చేసాను.....వేడి గాలి చెవులకు తాకుతుంది....చుట్టూ స్మశాన నిశబ్ధం.... నాకు మెల్లిగా భయం వేయసాగింది....వాళ్ళతో వెళ్ళకుండా ఎందుకు దిగాను... ఇక్కడ ఏదైనా దయ్యం ప్రత్యక్షం అయి నన్ను పట్టుకుంటే నా గతి ఏంటి అని నా బద్దక రాముడ్ని తిట్టుకుంటూ, మెల్లిగా అడుగులు వేయసాగాను....

కాస్త దూరం వెళ్ళాక నా వెనక ఎదో కదుల్తున్న  శబ్దం వినిపించింది.....నాకు ఒళ్ళు జలదరించింది...వెనక్కి తిరిగి చూసే దైర్యం లేదు.... వేగంగా అడుగులు వేయడం మొదలు పెట్టాను...నా వెనక కూడా అంతే వేగంగా ఏదో అడుగుల శబ్దం......నేను పరుగందుకున్నాను.....  పది అడుగులు పరిగెత్తి  ఆగి చూసాను....నా వెనక ఒక పొట్టేలు....పోయిన ప్రాణం లేచి వచ్చింది... హమ్మయ్య! ఇది పొట్టేలు...నేను ఇంకా దయ్యం ఏమో అని బయపడి చచ్చా....కాని నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు....ఆ పొట్టేలు రెండు అడుగులు వెనక్కి వేసి నన్ను కుమ్మడానికి  నా వైపు బలంగా పరిగెత్తుకు వచ్చింది....నేను తప్పించుకున్నాను....అయిన అది వదల్లేదు....మళ్ళి అంతే...మరో రెండు అడుగులు వెనక్కి వేసింది...నాకు సీన్ అర్ధం అయ్యింది...

నాకు పొట్టేలు చేతిలో చావడం ఇష్టం లేదు..... పిక్కబల మహా మంత్రాన్ని ఒక సారి గట్టిగా పఠించి... పరుగో..పరుగు... ...కాని మా అత్త వాళ్ళిల్లు ఇంకా చాల దూరం వెళ్ళాలి...నేను ఎంత దూరం వెళ్ళినా నన్ను వదల్లేదు.....నాకు ఆయాసం వచ్చి అగినప్పుడల్లా నేను కాస్త ఆగే వాడిని...అది కూడా ఆగేది...అది ఆ రెండు అడుగులు వెనక్కి వేసే లోపు మళ్ళి.... పరుగో.. పరుగు....అలా అది నన్ను పొలాల గట్లు,మా ఊరి మైదానాలు.... నాకు తెలియని చోట్లకు చాల తిప్పింది......
నేను పరిగెత్తి పరిగెత్తి..... ఒక ఇంట్లో దూరాను.....ఆ ఇంట్లోనుంచి  ఒక ఆవిడ అభయ దేవతలా వచ్చి నన్ను ఆ దుష్ట పొట్టేలు నుండి రక్షించింది... అలా ఆ పొట్టేలు బారి నుండి తప్పించుకున్నాను.....కాసేపు అక్కడే కూర్చున్న....ఆమె నా వివరాలు అన్ని అడిగి నేను ఎవరింటికి వచ్చానో అన్ని కనుక్కుంది.....ఆయాసం తీరాక అత్త వాళ్ళింటికి బయలుదేరాను.... నేను వెళ్ళిన చాల సేపటికి పాల పోరకకి వెళ్ళిన వాళ్ళు వచ్చారు... మధ్యాన్నం అంతా మా చిన్న బావ తో ఎక్కడెక్కడో తిరిగి నేను సాయంత్రం వరకు ఇంటికి వచ్చేసాను.....
చుట్టాలు అందరూ అరుగు మీద కూర్చొని నవ్వుతున్నారు....నేను వెళ్ళే సరికి వాళ్ళ నవ్వు ఎక్కువైంది...నాకు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలియలేదు....మా వదినవచ్చి....నిన్ను పొట్టేలు తరిమిందా....? అంటూ తెగ నవ్వేసింది... అప్పుడు అర్ధం అయ్యింది...వాళ్ళు అందరూ ఎందుకు నవ్వుతున్నారో.... నాకు చాలా సిగ్గేసింది... చ! ఆ పొట్టేలు చేతిలో చచ్చినా అయిపోయేది.....

పెళ్లి అయిపొయింది.... మేము మా ఊరికి వచ్చేసాం......కాలక్రమేనా దసరా సెలవులు దగ్గరకు వచ్చాయి.....

మా బావకి రెండో పెళ్లి.... మొదటి పెళ్లి వీగిపోయింది...ఎలాగు సెలవులు కదా అని ఈసారి కూడా అందరం వెళ్ళాం.....

పెళ్లి కి మూడు రోజుల ముందు పోశమ్మ కి బలి ఇవ్వడానికి ఒక పొట్టేలు ని తీస్కువచ్చారు మామ వాళ్ళు...

మా చిన్న బావ దాన్ని చూపిస్తూ చెప్పాడు...నిన్ను ఊరంతా తరిమిన పొట్టేలు గుర్తుందా? ఇదే అది.

ఆ సమయం లో నాకు పగ ప్రతీకారాలు గుర్తు రాలేదు.... పాపం! బలి అనే పేరుతో మరో మూగ జీవాన్ని చంపుతున్నందుకు దాని మీద చాల జాలి వేసింది....ఆర్నెల్ల క్రితం ఎంతో స్వేచ్చగా, గర్వంగా తిరిగింది...

ఇప్పుడు బలికి సిద్దమైంది....దానికి నేను గుర్తుకు ఉన్నానో లేదో అసలు....

Jul 11, 2011

కబడ్డీ..

అప్పుడు నేను చాల చిన్నవాడిని..... ఒకటో తరగతి అనుకుంటా..
అది ఒకానొక ఆగష్టు 15, మా స్కూల్లో ఆటల పోటీలు పెట్టడం అదే మొదటి సారి......చాల మంది ఉత్సాహంగా పాల్గొనడం మొదలు పెట్టారు...... మేము చాల చిన్న వాళ్ళం కాబట్టి మాకు ఏ ఆట ఎలా ఆడాలో తెలియదు...ఇదే ముక్క మా మాష్టారు గారికి విన్నవించాం.....ఆయన గారు మమ్ముల్ని అందర్ని పిలిచి ఒక గ్రూపు గా చేసారు.... నాలుగవ తరగతి పిల్లల్ని పిలిచి వాళ్ళని ఇంకో గ్రూపుగా  చేసి.... మా గ్రూపు లో ఒకడికి ఆట ఎం  చేయాలో చెప్పి......అవతలి గ్రూపు తో ఆడమన్నాడు......
వీడు “కబడ్డీ... కబడ్డీ.....” అంటూ వెళ్ళాడు ...... వీడు వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ వీణ్ణి పట్టుకునేసారు..........
“ అర్దమైందా......” అని అడిగారు మాష్టారు......అందరికి ఏమో గాని...నాకు మాత్రం మొత్తం అర్ధమై పోయింది.....ఇంతేనా కబడ్డీ అంటే.....ఇక కబడ్డీ లో మనమే రారాజు.....మనల్ని మించిన వాడు లేడు.....
“అరేయ్ నువ్వు వెళ్ళరా .......” అన్నాడు మాష్టారు నన్ను చూపిస్తూ........
సింహం జూలు విదిల్చింది......”కబడ్డీ.... కబడ్డీ......” .....
“కబడ్డీ......” అంటూ వెళ్లి అందులో ఒకడిని గట్టిగా పట్టుకున్న.......
అందరు ఒక్కసారిగా నవ్వారు......ఎందుకో నాకర్ధం కాలేదు....ఇంతకు ముందు వాడు వెళ్ళినపుడు కూడా అంతేగా.......అందరు కలిసి ఒక్కడిని పట్టుకున్నారు...... ఇప్పుడు నేను ఒకన్ని పట్టుకున్నాను...... వీళ్ళకు అసలు ఆటే రాదు..
ఎలాగైతేనేం..... మా తరగతి వాళ్ళకి కబడ్డీ పోటీలు జరగలేదు.....మరుసటి రోజు......పరుగు పందేలు..
తరగతి మొత్తాన్ని పిలిచి.....దూరంగా ఇద్దరు లాగి పట్టుకున్న ఒక తాడును చూపిస్తూ ...”దాన్ని ఎవరైతే ముట్టుకొని....మల్లి ఈ చివరకు మొదట చేరుకుంటారో....వాళ్ళు గెలిచినట్టు.....ఈల వేసేదాక ఎవరూ పరిగెత్త కూడదు. ” అంటూ ముగించాడు.....
ఈల వేసాడు మాష్టారు.......అందరూ పరిగెత్తడం మొదలు పెట్టారు...కొందరు ఆ తాడు ముట్టుకోకుండానే మధ్యలోనే వెనక్కి పరిగెత్తారు..........అందరికి కంటే నేనే గొప్ప వాడిని ...అసలు నేను పరిగెట్టలేదు .....ఎలాగు ఇదే చివరకు కదా అందరూ రావాల్సింది అని.....

సంతాపం

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.... ఇది నా విషయంలో చాలా కరెక్ట్.
నా చిన్నప్పుడు చాలా సార్లు నా తెలివి తేటల్ని ప్రదర్శించాను.
ఒక సారి మా అమ్మ బియ్యం చెరుగుతుంది, దూరంగా ఒక తొండ అప్పుడే మా అమ్మ కత్తిరించి పెట్టిన కూరగాయల వైపు వెళ్తుంది... అది చూసి నన్ను పిలిచి....”అరేయ్ దాన్ని కొట్టు.....” అని ఆజ్ఞాపించింది.......
అంతే.....మాత్రువాఖ్య పరిపాలనా దక్షుడనై ఒక ఇనుప చువ్వను చేబూని......అమ్మ ఆజ్ఞని నెరవేర్చాలి అన్న ఆవేశంలో.... దాని తలపై ఒక్కటిచ్చా......
దాని తలా, మొండెం వేరైపోయాయ్......మొండెం దొరికింది... తల ఎక్కడో ఎగిరిపోయింది....
కొట్టడం అంటే దూరంగా తరమడం అని తెలియని నా అమాయకత్వానికి ఒక నిండు మూగ ప్రాణం బలైంది....
అందుకే అప్పుడు చేసిన పొరపాటుకి ఇప్పుడు ఈ బ్లాగు ముఖంగా సంతాపం తెలియజేస్తున్నాను.......
రెండు నిమిషాలు మౌనం..............