Feb 10, 2012

RK6 HUTS - 1

ఆదిలాబాద్ జిల్లా, మంచిరియాల్ మండలంలో ఒక చిన్న బస్తి. సింగరేణి జీవితాలకు అద్ధం పట్టే ఒకానొక కాలని..... శ్రీరాంపూర్ కాలనీ....
వాళ్ళందరూ ఒక చోటికి చెందిన వాళ్ళు కాదు.ఎక్కడెక్కడి పల్లెల నుండి, పొట్ట చేత పట్టుకొని పని కోసం ఒక చోటికి చేరారు, ఇంచు మించు ముప్పై అయిదు సంవత్సరాల క్రితం.అందులో చాల మంది పేదవాళ్ళు. ప్రాంతాలు, పల్లెలు వేరైనా అంత కలిసి ఇక్కడ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్కున్నారు. వాళ్ళకి అప్పటి వరకు ఒకరికి ఒకరు తెలియదు.. అయిన సరే ఆడవాళ్ళూ అయితే “అక్కా!” మగవాల్లైతే “బావా!” అని, ఏదో ఒక బందం కలుపుకొని ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ బతకడం మొదలు పెట్టారు.
అందరివి ఒకే రకం ఇళ్ళు, అందరికి ఒకే జీతాలు.. అందరివి ఒకేరకం జీవితాలు. ఒక్కో మెట్టు ఎక్కుతూ సాగిపోయిన ఆ జీవితాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నేను అక్కడే వాళ్ళతో పాటే పెరిగాను... మా నాన్న ఒక సింగరేణి కార్మికుడు. అందరిలాగే బతుకుదెరువు కోసం ఆ ఊరికి చేరుకున్నాడు...
హరప్పా, మొహంజదారో లాగ ఇది కూడా ఒక నాగరికతల అనిపించింది నాకు...నా ముందే ఆ బస్తి ఏర్పడింది.
సింగరేణి కంపెనీ స్థలాల్లో అందరు గుడిసెలు వేసుకోవడం మొదలు పెట్టారు...పక్క ఇళ్ళు కట్టుకునే స్తోమత ఎవరికీ లేక పోయింది. దాంతో మా ఏరియా పేరు అదే పడి పోయింది..RK6 HUTS.
తడకలతో గోడలు...చిన్న చిన్న దూలాల సాయంతో,డంబార్ రేకులతో మా ఇళ్ళు, మావే కాదు అక్కడ చాల వరకు ఇంతే..మురికి నీరు వెళ్ళడానికి కాల్వలు... కరెంటు కోసం స్థంబాలు తెచ్చుకోవడం. ప్రతి ఇంటి నుండి ఒక పెద్ద కరెంటు తీగ వెళ్లి ఆ స్తంబానికి ఉన్న తీగాలకి వేలాడతీసే వాళ్ళు...అవి గట్టిగ పట్టుకొని ఉండడానికి కంకర రాళ్ళు కట్టే వాళ్ళు...అవి గాలికి అటు ఇటు కదిలితే మా గుడిసెలో కరెంటు పోయేది. అప్పుడు ఆ కరెంటు స్థంబం దగ్గరుకు పోయి ఆ తీగను అటు ఇటు కదల్చే వాళ్ళం... ఇంట్లో ఒకరు ఉండి పవర్ వచ్చిందా లేదా అనే సిగ్నల్ ఇస్తుండే వాళ్ళు. కాలక్రమేనా తడకల స్థానంలో మట్టి గోడలు...తర్వాత ఇటుకల గోడలు.డాంబార్ రేకుల స్థానంలో గూనలు వచ్చేసాయ్.... ప్రస్తుతానికి మనం గుడిసెల దగ్గరే ఉందాం.
వంటకి బొగ్గు పొయ్యిలు ఉపయోగించే వాళ్ళు.. ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉదయం బొగ్గు పొయ్యి వేసే వాళ్ళు...వాడ వాడంత దట్టమైన పొగ కమ్ముకు పోయేది...అసలు దారి కనిపించేది కాదు. చాలాసార్లు సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు దారి కనపడక ఆ బొగ్గు పోయ్యిలకే గుద్దుకునే వాళ్ళు. పొయ్యితో పని అయిపోయాక మిగిలిన బూడిద ని ఎక్కడైనా పడేసేవాళ్ళు... వాటి మీద కాలు పడి, కాల్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాన కాలం అయితే పొయ్యిలో మంట పెట్టడానికి ఆడవాళ్ళూ కష్టాలు అన్ని ఇన్ని కావు..బొగ్గు తడిచి పోయి అస్సలు మంట వచ్చేది కాదు.
జీతాలు, నేను ఇంతకు ముందు టపా లో చెప్పినట్టుగా.. నిజంగా అది ఒక  పండగే అక్కడ. నెల రోజులు లేనిది ఆరోజు సందడి మొదలు అవుతుంది.  చుట్టూ పక్కల గ్రామాల నుండి బియ్యం అమ్మడానికి వచ్చే ఎడ్లబండ్ల శబ్దాలతో ఆరోజు తెల్లవారేది. ఆరోజే జీతాలు కాబట్టి నెలకు సరిపడా బియ్యం ఒకే రోజు కొనుక్కునే వాళ్ళం. కిరాణ కొట్లలో చివరి నెల బాకీ కట్టేసి, ఈ నెలకు సరుకులు తెచ్చుకునే వాళ్ళం. ఆ కిరాణాకొట్టు వాడు దయదలిచి ఒక బిస్కట్ ప్యాకెట్ ఇస్తే ఇచ్చేవాడు...లేకుంటే ఎవరైనా బందువులు వచ్చినప్పుడు వాళ్ళు కొనిస్తే తప్ప మల్లి నెలలో బిస్కట్ ప్యాకెట్ చూసే వాళ్ళం కాదు. కీచుపిట్టలు ఊదుతూ, బలూన్స్ అమ్మే వాళ్ళు తెగ వచ్చే వాళ్ళు. సాదారణంగా రోజు ఒక సారి మాత్రమె కనపడే బొంబాయి మిటాయి వాడు ఆరోజు మాత్రం రెండు, మూడేసి సార్లు వచ్చే వాడు. సోడా బండి వాడు వచ్చి కట్టెల తలుపుకు గీసిన రంగు రంగుల గీతలు లెక్కపెట్టుకుని తనకెంత రావాలో చెప్పి వెళ్లి పోయేవాడు. సాయంత్రం మొదలు అవుతుంది అసలు గొడవ.. జీతాలు తెస్తారని ఎదురుచూసే ఆడవాళ్ళకి నిరాశే ఎదురవుతుంది... జీతాలు వచ్చాయని బాయి(బొగ్గు గని) మీద దావతు(పార్టీ) చేస్కునే వాళ్ళు...బాగా తాగేసి కొందరు డబ్బు పోగేట్టుకునే వాళ్ళు.... మత్తుగా తాగిన వాళ్ళు అక్కడే పడి పోయే వాళ్ళు... కొందరి దగ్గరి నుండి అప్పుల వాళ్ళు మొత్తం జీతం లాక్కునే వాళ్లు.  ఆరోజైన నాన్న ఏదో కొనుక్కువస్తాడు అని చూసే పిల్లల ఎదురుచూపులు ఎడుపుగా మారేవి. జీతాలు తెల్లవారి ఫీసులు తెమ్మని బడి పిల్లల్ని ఇంటికి పంపేవాళ్లు.
మాకు పర్యావరణం మీద మక్కువ ఎక్కువ.. ప్రతి ఇంటికి కచితంగా ఒక పండ్ల చెట్టు, కొన్ని పూల చెట్లు ఉండేవి.. మొక్కల కోసం ప్రత్యేకంగా స్థలం వదిలేసే వాళ్ళు...చెట్లు లేని ఇల్లని విచిత్రంగా చూసే వాళ్లు అనుకోవాలి... ముఖ్యంగా జామ చెట్టు ఉండేది.. కొందరు దానిమ్మ,అల్లనేరేదు, నిమ్మ చెట్లను పెంచుకునే వాళ్ళు.

2 comments:

  1. Current stambham vishayamlo naa gnapakalu kuda same....posts baga vunnayi rastuune undandi.....mee vyakteekarana chala bagundi...pottelu taramadam....bagundi ee blog continue writing.

    ReplyDelete
    Replies
    1. thanks for your comment, really you gave me boost to continue writing..

      Delete