Aug 10, 2011

అనుకోకుండా ఒక సినిమా!


“చాలా రోజులు అయింది చెన్నై కి వచ్చి.. ఒక్క తెలుగు సినిమా కూడా చూడలేదు......”

 నాకు ఈ ఆలోచన రాకుండా ఉండాల్సిందేమో....వచ్చెను పో... నేనేల తిరుపతి గాడికి చెప్పవలె...!

అది నా జీవితంలో మరో దురదృష్టకరమైన రోజు..... చెన్నై లో ఒక్క సినిమా కూడా చూడలేదని తిరుపతి గాడిని అడిగా... వాడు వెంటనే అనూష కి ఫోన్ చేసి...

“అను! నీకు ఉద్యోగం వచ్చింది కదా... పార్టీ ఏది? రేపు మమ్ముల్ని ఇద్దర్ని సినిమా కి తీస్కేల్లు....” ఇటు నుండి వీడు....

“నాకు చెన్నై లో థియేటర్ లు ఏమి తెలియవు కదా...మీరే టికెట్స్ బుక్ చేయండి... నేను రేపు డబ్బులు ఇచ్చేస్త......” అటు నుండి అను...

టక టకా...... నెట్ తెరిచాం.......

సిటి లో రెండు సినిమాలు ఆడుతున్నాయ్....ఒక సినిమా రివ్యూ బాగా లేదు....మిగిలింది ఇంకొక సినిమా.....

చూస్తే అదే సినిమా చూద్దాం లేక పోతే వద్దు అని మా వాడు మంకు పట్టు పట్టాడు....నాకు ఆ హీరో అంటే ఇష్టం లేదు.....

దానికి ఎక్కడా టికెట్లు లేవు..... చివరికి ఒక థియేటర్ లో మాత్రం ఉన్నాయ్.....

 “ఎక్కడ టికెట్లు లేవు...ఈ థియేటర్ లో మాత్రం ఎందుకు ఉన్నట్టు.....”

“అది సిటి కి దూరంగా ఉంది రా......”

“సరే! ఎక్కడైతే ఏంటి? చెన్నై లో ఎంత సేపట్లో వెళ్తాం లే... మహా అయితే గంట.....!!, మార్నింగ్ షో కి బుక్ చెయ్”.....

“అరేయ్ షో 9:30 కి రా.....!”

“ముందు బుక్ చెయ్ రా.... ఉన్న టికెట్లు కూడా అయిపోతాయ్.....!!”

టికెట్లు అయిపోతాయ్ అన్న కంగారు లో...అది ఎక్కడ ఉందొ కూడా ఆలోచించకుండా బుక్ చేసేసాం......

తర్వాత తీరిగ్గా గూగుల్ మావయ్యని అడిగాం.......

అదిగో... అక్కడ ఆ మూల సౌదంబులో ..........చెన్నైలో ఒక మూలగా...ఆ ప్రదేశం ఉంది....

గూగుల్ లో దూరం ఎంత ఉందొ చూసాం....ఎక్కడా... ఆగకుండా వెళ్తే రెండు గంటలు.... మనవి బస్సు ప్రయాణం కాబట్టి రెండున్నర గంటలు....సినిమా 9:30 కి అంటే మనం 7 కి బస్టాండ్ లో ఉండాలి.....అలా ఉండాలి అంటే...రూం లో నుండి 6:30 కి బయలు దేరాలి.....మనం రెడీ అవడానికి గంట.....అంటే....మనం 5:30 కి లేవాలి అన్న మాట......

ఈ మాట వినగానే..నాకు దు:ఖం వచ్చింది.... ఎవడైనా ఈ ప్రపంచం లో సండే 5:30 కి లేస్తాడా?

“ఛీ! దీనమ్మ జీవితం......” అనుకుంటూ అను కి ఫోన్ చేసాం....

బహుశ...జంధ్యాల తిట్ల దండకం లో కూడా అన్ని తిట్లు లేవేమో.... ప్రపంచం లోని అన్ని బాషల్లో తిట్లు అయిపోయాక సరే అని చెప్పి ఫోన్ పెట్టేసింది......

మాకు బస్సు రూట్ ఓకే గాని...అనుష కి డైరెక్ట్ రూట్ లేదు.... కాబట్టి మధ్యస్తంగా చెన్నై సెంట్రల్లో కలుసుకుందాం అనుకుని అక్కడి నుండి వెళ్దాం అని ప్లాన్ వేస్కున్నాం...

అక్కడ మేము 8 కి ఉండాలి అనుకున్నాం.....అసలు మాకు అక్కడి నుండి కూడా ఎ బస్సో తెలియదు.....

అలారం మోగక ముందే లేచేసాం....తొందరగా రెడీ అయ్యి చెన్నై సెంట్రల్ కి వెళ్ళాం.... అక్కడ అను కోసం ఎదురుచూస్తున్నాం..... తను వచ్చేలోపు బస్సు గురించి ఆరా తీసాం.... బస్సు లో పోతే అక్కడి నుండి సరిగ్గా గంట....అది మనం అనుకున్న టైం కి బస్సు దొరికితే...అప్పటికి ఇంకా ఎనిమిది కావడానికి పది  నిమిశాలు ఉంది..... అను ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది....

నాకు సినిమా చూస్తా అన్న నమ్మకం పోయింది..... హాయిగా సెంతిల్ అన్న హోటల్ లో ఇడ్లి తిని రూం లో పడుకోక ఎందుకొచ్చిన సినిమా నాకు....

మెసేజ్ చేస్తే అను దగ్గరి నుండి సమాధానం లేదు....కాసేపటికి తనే కాల్ చేసి ఇంకో పదిహేను నిమిషాలు పడుతుంది అంది.... అప్పటికి ఎనిమిది దాటి పది నిమిషాలు అయ్యింది....

ఈలోపు ఒక మాహనుబావుడు....”బాబు! మీరు విల్లివాకం వెళ్తున్నార....? బస్సు లో వెళ్తే ఆలస్యం అవుతుంది గాని...ఇక్కడి నుండి లోకల్ ట్రైన్లు ఉన్నాయ్” అన్నాడు.....

హారర్ సినిమాలో ఇంటర్వెల్ పడినంత ఆనందం కలిగింది నాకు.... హనుమంతుని తోక లాంటి లైన్ ఉంది ఆ టికెట్ల దగ్గర.... అయిన సరే మొండి దైర్యం తో నేను వరుసలో నిల్చొని మా వాడిని అను వచ్చే స్టాప్ కి వెళ్ళమని చెప్పా....

టికెట్లు తొందరగానే దొరికాయ్.....అను రావడం..తనతో పాటే మా ట్రైన్ కూడా రావడం రెండు ఒకే సారి జరిగాయ్....జనమంత అదే ట్రైన్ కోసం వేచి చూస్తున్నారు.... ఒకటే జనం.....

 మేము పరిగెత్తుకుంటూ వెళ్లి.. హడావుడిగా ఒక బోగీలో ఎక్కాం....అందులో కొద్దిగా రద్దీ తక్కువగా ఉంది... అదే మాట్లాడుకోవడం మొదలుపెట్టాం.....ఇంతలో మా మాటలు అర్ధం చేస్కున్న మరో మహానుబావుడు.. “ఇది సెకండ్ క్లాసు...మీది జనరల్ టికెట్ అనుకుంట....” అన్నాడు...

మా మొఖాలకు తెలంగాణా ట్రైన్ తప్ప వేరే ట్రైన్ ఎక్కిందే లేదు కదా.... తొక్కలో సబరబాన్ రైళ్లకు కూడా క్లాసులు ఉంటాయని తెలియలేదు...

ఏడ్వలేక నవ్వుతు... వాడికొక థాంక్స్ పడేసి......చీమలు దూరని చిట్టడివి మాదిరిగ ఉన్నఇంకో బోగిలోకి ఎలాగోల దూరేసాం......

మాకు అక్కడే సినిమా మొదలయ్యింది...రైల్ అస్సలు కదలడం లేదు.... జనం దొబ్బులాటలో... ఆ ఉక్కపోతలో....

నాకు అందులోనుండి దూకి ఆత్మహత్య చేస్కోవాలి అనిపించింది....సినిమా చూసి చచ్చినా ఒక అర్ధం ఉంటుంది గాని...చూడడానికి వెళ్తూ చావడం ఏంటి అనుకొని..ఆ ప్రయత్నం మానుకున్న....

ముక్కుతూ... మూలుగుతూ.... మేము వెళ్ళాల్సిన స్టేషన్ కి వచ్చేసాం...

విల్లివాకం అంటే ఏదో సిటీ అనుకున్నాం...అదో పల్లెటూరుల ఉంది....

అక్కడ ఒక ఆటో మాట్లాడుకున్నాం..... వాడు సందుల బొందులలోనుండి పాముల మెలికలు తిప్పుతూ....ఎగుడుదిగుడు చోట్లలో పోనిస్తూ.... అసలే విసిగిపోయిన మమ్ముల్ని ఇంకా విసిగించేసాడు.....ఇంకో పదినిమిషాల్లో సినిమా అనే సమయానికి అక్కడ దించి వేసాడు....

చెన్నైకి ఇంత దూరంలో థియేటర్ కట్టినందుకు థియేటర్ వాడిని...ఇదే సినిమాకి టికెట్లు బుక్ చేసినందుకు మా స్నేహితుణ్ణి నానా తిట్లు తిట్టుకొని.. సినిమా చూసా....

సినిమా మాత్రం బాగుందండొయ్...లేకపోతే సినిమా తీసిన వాడిని కూడా తిట్టుకోవాల్సి వచ్చేది....

No comments:

Post a Comment