Aug 8, 2011

ఎనిమిదవ తేది


ఇవ్వాళ ఎనిమిదవ తేది... జీతాలు వస్తాయి.....

నాన్న ఖార తీస్కోస్తాడు, అరటిపళ్ళు కొనుక్కొస్తాడు......తొందరగా వెళ్ళకపోతే మొత్తం తమ్ముడే తినేస్తాడు, నాకేం మిగిల్చడు.

**************************************************************************

ప్రపంచం అంతా ఒకటో తేది కోసం చూస్తే... సింగరేణి కుటుంబాలు మాత్రం 8వ తేది గురించి ఎదురు చూసేవి....ఆరోజంటే అందరికి పండగలాంటిది...
ఆరోజు వస్తుందంటే చాలు, పిల్లలందరికీ ఎంత ఆనందమో అసలు....ఆ ఒక్క రోజు కోసం నెల రోజులు అందరు పిల్లలు ఎదురు చూసే వాళ్ళు....... అందులో నేను ఒకడిని.
మద్యాన్నం చిట్టి బెల్లు కొట్టగానే ఉరుకులూ పరుగులూ పెడుతూ ఒకడిని ఒకడు నెట్టుకుంటూ మరి పరిగెత్తే వాళ్ళు... ఒక్కొక్కడిలో మొదటిసారి హరివిల్లును చూసిన సంబరం కనిపించేది.

తలుపులు దబాలున తోస్తూ వెళ్లి....”అమ్మ ముందు నాకు ఖార పెట్టు...” అని పిల్లల గోల మొదలయ్యేది...ఆరోజు అన్నం మాటే ఎవడు ఎత్తడు.... ఒకవేళ ఇంకా నాన్న రాక పోతే... నాన్న సైకిల్ బెల్లు ఎప్పుడూ మోగుతుందా అనుకుంటూ గుమ్మం లోనే ఎదురు చూసే వాళ్ళు... ఒకవేళ ఎవరైనా ఏమి కొనకుండా ఊరికే వచ్చారో ఇక అంతే... ఆరోజు వాళ్ళకు మగధీర సినిమా కనపడేది....
మధ్యాన్నం బడికి వెళ్ళాక మా నాన్న అవి తీస్కువచ్చాడు ఇవి తీస్కువచ్చాడు అని..... రెండవ గంట కొట్టేవరకు ఒకటే గోల గోల చేసేవాళ్ళు.... సాయంత్రం మళ్ళి పరుగు.. మద్యాన్నం మిగిలింది తమ్ముడు ఎక్కడ తినేస్తాడో అని...
**************************************************************************

నెల జీతం బతికే జీవితాల్లో నిజంగానే అదొక పండగరోజు.....కుటుంబ ఖర్చులు బరించలేక.. మామూలు రోజుల్లో పిల్లలకు ఏమైనా కొనివ్వాలంటే ఎవరికీ దైర్యం వచ్చేది కాదు.....

ఇలా మా జీవితాల్లో ఒకటిగా కలిసిపోయిన ఎనిమిదవ తేది కొన్ని సంవత్సారాలకి మాయం అయిపొయింది... మా వాళ్ళు పని చేసే బొగ్గు గని మీద జీతాలు ఇవ్వడం మానేసి, బ్యాంకు ఖాతాలోకి జీతం వచ్చేసేది....

ఇప్పుడు పిల్లల్లో ఆ ఉత్సాహం లేదు..ఎదురు చూసే వాళ్ళు లేరు..... జీతాలు వస్తే రోడ్ల మీద పోటీపడి పరిగెత్తే పిల్లల పరుగులూ ఆగిపోయాయి...

ఇప్పుడు జీతాలు కూడా పెరిగాయి.... ఆ తేది కోసం చూసే అవసరం కూడా ఎవరికీ లేదు... ఎప్పుడు పడితే అప్పుడు కావాల్సింది కొనుక్కునే స్థితికి అందరూ వచ్చేసారు....

No comments:

Post a Comment