Jul 31, 2011

.....

చీకటి పడి చాలా సేపు అయ్యింది ఇంకా ఈ కంప్యూటర్ ల్యాబ్ లో ఉండడం నాకిష్టం లేదు... త్వరగా వెళ్లి పోవాలి, లేదంటే చివరి బస్సు కూడా వెళ్ళిపోతుంది.. ఆదుర్దాగా బ్యాగ్ సర్దుకున్నాను... ఇంటికి ఆలస్యం అయిపోయిందనే కంగారు మొదలైంది.... వడి వడిగా అడుగులు వేస్తూ బయటికి కదిలాను...అప్పటి వరకు కుండపోతగా వర్షం కురిసి ఆగిపోయింది...అప్పటికే చుట్టూ దట్టమైన చీకటి పేరుకుపోయింది...నేను బయటకు రాగానే అప్పటి వరకు ఉన్న కరెంట్ కూడా పోయింది... నిండు పున్నమిని మేఘాలు కప్పేసాయి... దారి అంతా కూడా నిర్మానుష్యం. నా బస్సు స్టాప్ కి వచేసాను..అక్కడ కూడా ఎవరు లేరు...నాకు తెలిసి ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయినట్టు ఉంది... చేతికి పెట్టుకున్న గడియారం పనిచేయట్లేదు.. ఎంత సేపు నిరిక్షించాలో..!!

వచ్చేస్తుంది.. ఎప్పుడు ఈ బస్సు నేను చూడలేదు... బోర్డు కూడా లేదు..అయిన సరే ఎ బస్సు అయిన నేను వెళ్ళే దారి మీదుగానే వెళ్ళాలి కదా...తెల్లని దీపాలు బస్సంతా వెలుగుతున్నాయ్..అంత చీకటిలో ఆ బస్సు వెలుగుకి దారి అంతా కనిపిస్తుంది... నా ముందే వచ్చి ఆగింది... బస్సు లోకి ఎక్కాను...

బస్సులో ఎవరు లేరు..అంతా కాలిగా ఉంది....దూరంగ ఒక మూలగా కిటికీ పక్కన కూర్చున్నాను... బస్సు కదిలింది.. కిటికీ లోంచి చల్లగా గాలి తగిలింది... ఒళ్లంత ఒకసారి జలదరించింది.... ఎంతగా చూసిన ఆ కారుచీకట్లో ఏమి కనిపించట్లేదు... నిర్మనుశ్యానికి నిశ్శబ్దం తోడైనట్టుగా ఉంది...

ఓవర్ బ్రిడ్జి దాటేసింది....తోళ్ళవాగు..... వెళ్తూనే ఉంది..ఎక్కడా ఆగట్లేదు... దారంతా  ఎవరూ లేరు....

ఎవేవో ఆలోచనలు చుట్టుముడుతున్నాయ్..... రోజంతా ఎక్కడెక్కడో తిరిగాను...

ఆలోచనల ప్రవాహం.......అక్కడే.. అదే ఆలోచనల ప్రవాహం లో ఎంతో సేపు గడిపాను... అక్కడి నుండి బయటికి రావాలని లేదు....

 చాల సేపు అయ్యింది బస్సు బయల్దేరి....ఈపాటికి నేను వెళ్ళే చోటు దాటేయ్యాలి.....

 బయటకి చూసాను....

నిశ్శబ్దం...చుట్టూ నిశ్శబ్దం....చీకటి అలుముకున్న నిశ్శబ్దం...

ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగ ఉరుములు మెరుపులతో మళ్ళి వర్షం మొదలైంది.... ఇంకాస్త చల్లగా గాలి వీయడం మొదలైంది...

చుట్టూ చూసాను...కండక్టర్ లేడు .....ఒక్కన్నే ఉన్నాను బస్సు లో.. ఆశ్చర్యం!.. మళ్ళీ ఒకసారి కిటికీ లోనుండి చూసాను....ఇది నా దారి కాదు...ఎప్పుడూ చూడలేదు ఆ ప్రదేశం....

నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియట్లేదు... ఏదో తెలియని ప్రపంచం లో ఉన్నాను....నా చుట్టూ ఇప్పుడున్న ప్రపంచం నాది కాదు అని నాకు స్పష్టంగా తెలుస్తుంది...

నేను ఎక్కడో...నాకు తెలియని చోటులో....నాది కానీ ప్రపంచంలో...

ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన మదిలో లేదు.....ఎందుకో అలాగే మౌనంగా కూర్చుండి పోవాలి అనిపిస్తుంది..

ఉరుముల శబ్దం ఇంకా ఎక్కువైంది...వాన జల్లు కొద్ది కొద్ది గా నా మీద పడుతుంది... ఏదో తెలియని అపస్మారక స్థితి లోకి వెళ్తున్నాను.... నా ఒంట్లో శక్తి తగ్గిపోతుంది...కదల్లెకుండా ఉన్నాను....

నేను బతికే ఉన్నానా?.....

నా చూపులు ఎం వెతకట్లేదు.......  ఆలోచన పనిచేయడం ఆగిపోయింది.... నేను నా ఆధీనం లో లేను..... అయిన కూడా మౌనం వీడాలని లేదు..... నా మీద నాకు క్రమంగా పట్టు తప్పిపోతుంది....ఎం చేయాలో తెలియట్లేదు......

“భయంగా ఉందా!!” డ్రైవర్ సీట్లోంచి గంబీరమైన స్వరం వినిపించింది...

అటు వైపుగా చూసాను..అక్కడ ఎవరూ లేరు...ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్వరం..?

వాన తగ్గిపోయింది..వెలుగును కప్పేసిన చీకట్లో దారి అంతా మసకగా కనిపిస్తుంది...నాకు తెలిసిన చోటులా అనిపిస్తుంది...ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా...కానీ బస్సు మాత్రం ఎక్కడా ఆగట్లేదు....

అదే కిటికీ.....బయటకి తొంగి చూస్తూనే ఉన్నాను... నాకు తెలిసిన వాళ్ళు అందరూ అక్కడక్కడ కనిపిస్తున్నారు.....వాళ్ళంతా నావైపే చూస్తున్నారు.. కానీ నన్ను మాత్రం పిలవట్లేదు...

నన్ను చిన్నప్పుడు బడికి తీస్కు వెళ్ళిన మా టీచర్.... నాతో ఆడుకున్న రవి.. మా తాతయ్య...బందువులు...అందరూ...అందరూ అక్కడే ఉన్నారు... నా వంకే దీనంగా చూస్తూ..

నాకూ  వాళ్ళని పిలవాలని లేదు.....మెల్లిగా కటిక చీకటి ఆవరించింది...ఎంతగా చూసిన ఏమి కనిపించట్లేదు...

మళ్ళీ వర్షం.....

“భయంగా ఉందా..?” అదే గొంతు...

లేదు అని చెప్పాలని ఉంది... కానీ చెప్పలేకపోతున్న... నా పెదవులు కదలట్లేదు...

No comments:

Post a Comment