Jun 25, 2012

సింగరేణి పండుగలు


ఇక పండుగల విషయానికి వస్తే మాములుగా అందరు జరుపుకునే ఉగాది నుండి దసరా వరకు పండుగలు పోను కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి పోశమ్మ బోనాలు, సైడ్ పిల్ల, చెట్ల తీర్థాలు(వన బోజనాలు), రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క జాతర, జెండా వందనం(మాకు స్వాతంత్ర్య దినం,గణతంత్ర దినం అని విడిగా తెలియవు ఏదైనా సరే అది మాకు జెండా వందనం అంతే)

పోశమ్మ బోనాలకి,చెట్ల తీర్థానికి మేము అడక్కండానే మా వాళ్లు మమ్ముల్ని బడి ఎగ్గోట్టమనే వాళ్లు. ఈ పండుగలు రెండు రకాలుగా జరుగుతాయ్, ఒకటి ఎవరికీ వారే, ఇంకోటి గుంపుగా. అది ఎలాగంటే పోశమ్మకి ఎవరికీ వారే విడిగా ఇంట్లో ఒకసారి చేస్కుంటారు మల్లి అందరితో పాటుగా ఒకసారి అందరు కలిసి పోశమ్మ గుడికి వెళ్లి ఉత్సవం చేస్తారు. ఇలాగె సమ్మక్క జాతర కూడా. పోశమ్మ గుడిలో బట్టతో కుట్టిన చిలకలు కట్టే పద్ధతి ఉండేది, ఆరోజు నాకొకటి అంటే నాకొకటి అని చాల మంది మా ఇంటికి వచ్చే వాళ్ళు.. ... చెట్ల తీర్తాలకైతే ఇంటి దగ్గర సైడ్ పిల్ల అని వాడంత కలిసి ఒక మేకని బలి ఇచ్చి, ఇది సరిపోక రెండు మూడు వారాల తర్వాత చెట్లతీర్థం అని దగ్గర ఉన్న చిట్టడివికి వెళ్లి ఇంకో మేకని బలి ఇస్తారు. ఈ బలులు ఇంతటితో ఆగవు...బాయి మీద మైసమ్మ అనే పేరుతో కూడా బలులు ఇస్తారు...

భయంతోనో, భక్తితోనో, ఆచారం పేరుతోనో ఇవి జరుగుతూనే ఉంటే... ఇవి కాక ఎవరికి ఎప్పుడు మాంసం తినాలి అనిపిస్తే అప్పుడు ఇంకేదో దేవుడో, దయ్యమో గుర్తుకు వచ్చి మల్లి ఇంకో మూగ ప్రాణిని బలి చేస్తారు...సర్లెండి ఈ బలుల గురించి వదిలేద్దాం కాసేపు...చెట్ల తీర్థం గురించి చెప్పుకుందాం..

పట్నం లో అయితే వన బోజనాలు అంటారు, మేము మాత్రం చెట్ల తీర్థం అనే అంటాం.

బాగ్యనగరం బోనాల మాదిరిగానే ఉన్నా మా సంబరంలో కొంచెం తేడా ఉంటుంది.

చెట్ల తీర్థం వెళ్ళే ఉదయమే ఇంట్లో పిండి వంటలు చేస్తారు..పిండి వంటలు అంటే పిండి తో చేసే వంటలు...క్షమించాలి, వంటలు కాదు వంట మాత్రమె. ఎందుకంటే ప్రతి ఇంట్లో విధిగా పూరి మాత్రమె చేసే వాళ్ళు.

మసాలాలు, బియ్యం, పూరీలు, పళ్ళాలు, వంటకు కావాల్సిన సామగ్రి అంత ఒక గమాలలో(గంప) వేసుకుని, దాని మీద సున్నం గీతలు గీసి, వాటి మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టి, ఆడవాళ్ళూ ఆ గంప నెత్తిన పెట్టుకుని బయల్దేరేవాళ్ళు.. మేము సైకిల్ మీద కట్టెల మోపు, బింద, మా అమ్మ మోయలేక వదిలేసినవి తీస్కుని వాళ్ళ ముందే వెళ్ళే వాళ్ళం, మా అందరి కంటే ముందు, సపరివార సమేతంగా అన్నట్టుగా, తనకేదో ఊరేగింపు చేస్తున్నారు అన్నట్టుగా రాజసంగా బలిచ్చే మేక కదిలేది...”గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టు...”.

ఆరోజంతా ఊరు మొత్తం ఊర్లో కాక అడవిలో ఉండేది... అందరు చెట్ల తీర్థంకు వస్తారు కాబట్టి మాకు స్థలం దొరకడం కొంచం కష్టమయ్యేది.. కాని అడవి తల్లి విశాల హృదయంలో మాకు ఎప్పటికి చోటు ఉండేది. మా వాడ గుంపు అంతా అడవిలో ఏదో వైపు ఆక్రమించుకునే వాళ్ళం..ఏదో ఒక చెట్టు కింద మా గంపలు పెట్టేసి.. ఎండ పడకుండా పందిరి వేసుకుని.. దాని మీద ఆకులతో కప్పేసే వాళ్ళం...పిల్లల హంగామా చూడాలి... ఒకరి కొత్త ఇల్లు ఇంకకరికి చూపిస్తూ సందడి చేసే వాళ్ళు..గుంపుగా బయలుదేరి అందరి ఇళ్లను సర్వే చేసేవాళ్ళు...బహుమతులు ఎం ఇవ్వక పోయినా, ఉత్తమ గృహం అవార్డును మాత్రం ఎవరికో ఒకరికి ఇచ్చే వాళ్ళం...

కాసేపయ్యాక సీతాకోక చిలుకల్ని,బంగారు పురుగుల్ని పట్టుకోవడం లేకపోతే సంప్రదాయ బద్దంగా ఒలంపిక్స్ నిర్వహించే వాళ్ళం. గూటి బిల్లాగోలీలు, సీకులు, దొంగ పోలీసు, కరెంటు షాక్, ఔటిచుకునుడు, ఇవన్న మాట..నేను అన్నిట్లో ప్రథమ స్థానం(చివరి నుండి)..

మగవాళ్లంత బలిని సిద్దం చేసి, పోగులు పెట్టేంత వరకు వాళ్ళ బిజీ లో వాళ్ళు ఉంటారు.

పొయ్యి రాళ్ళు వెతికి తేవడం, దగ్గర ఉన్న బొగ్గు గని దగ్గరికి వెళ్లి నీళ్ళు తీస్కురావడం మా పనులు. ఈ రెండు పనులు మాకు నిధి అన్వేషణతో సమానం. ఆరోజు అందరికి అవసరం కాబట్టి పొయ్యి రాళ్ళు దొరకడం కష్టం. ఎక్కడో దూరం నుండి చూసి ఆ రాయి నాదంటే నాదని కోట్లడుకునే వాళ్ళం. కొన్ని సార్లు సగం భూమిలో పాతుకు పోయిన రాళ్ళని పెకిలించి తెచ్చేది. పొయ్యిని పుదుచ్చి(తయారు చేసి, పూజించడం), ఆడవాళ్ళంత అన్నం వండేసి, మాంసం రాగానే దాన్ని వండడం మొదలు పెడతారు. అందరు ఏదో ఒకటి మరిచిపోయే వాళ్ళు.. కొందరు నూనె తెచ్చుకోవడం, కొందరేమో ఉప్పు,కారం తెచ్చుకోవడం మరిచిపోయేవాళ్ళు. ఉన్న వాటిలో అందరు కలిసి సర్దుకు పోయి మొత్తం మీద వంట పూర్తి చేసే వాళ్ళు. వంట మద్యలో అప్పుడప్పుడు వర్షం కురిసేది. మేము వేసిన పందిరి బలంగా ఉంటె మా వంటకి ఎటువంటి ఆటంకం రాకపోయేది, లేకపోతే వేరే వాళ్ళ పందిరిలోకి దూరే వాళ్ళం. ఒక సారయితే ఇంటికి వచ్చేసి వండుకన్నాం. గొడుకు పట్టి వంట చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. వానలో మంటలు..ఆ మంటల మీద వంటలు..ఈలోపు మేము వెళ్లి, సంవత్సరానికి ఒక సారి మాకు మంజూరు అయిన కూల్ డ్రింక్స్ తెచ్చుకునే వాళ్ళం. ఇంట్లోకి ఎవరైనా బందువులు వచ్చినపుడు మాత్రమె కూల్ డ్రింక్స్ తెచ్చేవాళ్ళు.. అది కూడా బంధువులకి మాత్రమె. మాకు ఒక చిన్న గిలాస(గ్లాస్) లో పోసి తాగడానికి ఇచ్చేవాళ్ళు. కాని ఈరోజు మాత్రం మొత్తం సీసా మాకే. పెద్దవాళ్ళంత వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్ తెచ్చుకునే వాళ్ళు. పిల్లలందరం బోజనాలు చేయడానికి టేకు ఆకులూ తెచ్చుకునే వాళ్ళం.

 ఇక బోజనాలు మొదలు...వచ్చే సారి మీరు అల్లుడితో రావాలి అంటే మీరు మనవడితో రావాలి అంటూ చమత్కారాలు విసురుకోవడం చేసేవాళ్ళు.  ఈ ఇంటి వంట ఆ ఇంటికి, ఆ ఇంటి మందు ఈ ఇంటికి....పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తూ ఎంతో ఆనందంగా బోజనాలు అయ్యేవి..మన కుటుంబం అంటే మన ఇంటికి మాత్రమె పరిమితం కాదు అనిపించే విధంగా ఉండేది. నిజంగా ఆ ఆనందం వెలకట్టలేనిది.
బోజనలయ్యాక అందరు లేవలేక లేస్తూ...నడవలేక నడుస్తూ.. వెళ్ళలేక వెళ్ళేవాళ్ళు...
మధుర క్షణాల్ని దూరం చేస్కోలేక కాదు సుమండి..చాలా మందికి తాగింది దిగక, కొంతమందికేమో తిండి ఎక్కువయ్యి, అదేలెండి భుక్తాయాసం.
కొందరు చిన్న పిల్లలైతే “ఈ కొత్త ఇల్లు బాగుంది అమ్మ!! ఇక్కడే ఉండిపోదాం” అంటూ మారాం చేసే వాళ్ళు.
దొరికిందే అదనుగా, మాకు ఎవరి మీదైతే పగ తీర్చుకోవడానికి ఏళ్లుగా ఎదురు చూస్తున్నామో, వాళ్ళ టైర్లలో గాలి తీసే వాళ్ళం. తర్వాత వాళ్ళ బాధ చూసి పాపం అనుకునే వాళ్ళం. ఇవ్వాల ఆడిన ఆటలకు, తిరిగిన తిరుగుడుకు మాకు కాళ్ళు నొప్పులు పుట్టేవి...
hmm…రేపు కూడా బడి బంద్!!! J J

1 comment:

  1. JAVA99 Casino Resort Tickets - Event Calendar - Jackson
    JAVA99 Casino 충청남도 출장마사지 Resort tickets and upcoming 2021 event schedule. Find details for 청주 출장안마 JAVA99 Casino Resort in Jackson, Mississippi, including venue info and seating Jan 25, 2022Dancing with the 대구광역 출장안마 Stars - Dec 수원 출장마사지 12, 2022Reba McEntire Jan 26, 2022Reba 경주 출장안마 McEntire

    ReplyDelete