Showing posts with label Life as I saw. Show all posts
Showing posts with label Life as I saw. Show all posts

Jan 6, 2012

సాఫ్ట్ వేర్ జీవితాలు:


ఇదొక రంగుల మాయా ప్రపంచం... ఎంతో మంది యువతీ యువకుల కళల ప్రపంచం... నా అనే బంధాలు మరిచిపోయి... మన అనే వాళ్లకు దూరంగా.... ప్రపంచం వెలివేసినట్టుగా ఉండే అద్దాల మేడల్లో బ్రతికే జీవితాలు. సొంత ఇంటికి చుట్టాల్లాగా, ఎప్పుడో పండగలకి మాత్రమే వెళ్తూ... శాశ్వతం కాని కొత్త పరిచయాలనే స్నేహం అనుకుంటూ బ్రతికే జీవితాలు.... ప్రతి రోజు నవ్వుల ముసుగుని ముఖానికి తగిలించుకొని... మేము ఎం కోల్పోవడం లేదు అని మాకు మేమే సర్ది చెప్పుకునే అబద్దపు బతుకులు...

పుట్టింది ఎక్కడో.. చదివింది ఎక్కడో.. ఇక్కడ వలస వచ్చిన కూలీల లాగ మా పని స్థలానికి దగ్గరలో రూమ్స్ తీసుకొని ఒక తాత్కాలిక లోకాన్ని ఏర్పాటు చేస్కున్నాం... ఏరోజు ఎవరు కనిపిస్తే వారే ఆరోజుకి ఆప్తమిత్రులు... ఇక్కడ దగ్గరి మిత్రుడు అనే పదానికి తావు లేదు.. నిన్న పరిచయం అయిన వాడైన సరే, వాడ్ని చిరకాల మిత్రుడుగానే పరిగణిస్తాం..
ఎంత పెద్ద రహస్యమైన సరే వీడు మన వాడు, వాడు ఎవడో అనే తేడా లేకుండా అందరితో సమానంగా పంచుకుంటాం... ప్రేమ, ద్వేషం, కోపం, సంతోషం అనే రాగ భేదాలు లేకుండా ఎదుటి వాడు మన శత్రువైన..వాడి మీద మనకు ఎంత కోపం ఉన్నా... చిరునవ్వుతో పలకరిస్తూ...అందరితో ఒకే రకమైన హావభావాలు పలికిస్తూ...క్షమించాలి నటిస్తుంటాం. మనం ఎం చదివాం..రోజు ఎం చేస్తున్నాం అని కాకుండా, ఒకటో తారిఖు జీతం వచ్చిందా లేదా అన్నది మాత్రం పట్టించుకుంటూ గడిపేయాలి....
షాపింగ్ మాల్స్ లో, రెస్టారెంట్స్ లో, డోమినోస్ లలో ఆనందం మాకు క్వింటాళ్ళ కొద్ది దొరుకుతుంది... అలా అనుకోవాలి.. లేకపోతే బతకలేము. ఇది సరిపోక జీవితాలు యాంత్రికం చేసుకోవడానికి సోషల్ నెట్ వర్క్స్ కూడా... మీకు తెలుసో లేదో...పేస్ బుక్ లో ఎకౌంటు లేక పోవడం బ్రహ్మహత్య మహాపాతకం తో సమానం...  

Aug 8, 2011

ఎనిమిదవ తేది


ఇవ్వాళ ఎనిమిదవ తేది... జీతాలు వస్తాయి.....

నాన్న ఖార తీస్కోస్తాడు, అరటిపళ్ళు కొనుక్కొస్తాడు......తొందరగా వెళ్ళకపోతే మొత్తం తమ్ముడే తినేస్తాడు, నాకేం మిగిల్చడు.

**************************************************************************

ప్రపంచం అంతా ఒకటో తేది కోసం చూస్తే... సింగరేణి కుటుంబాలు మాత్రం 8వ తేది గురించి ఎదురు చూసేవి....ఆరోజంటే అందరికి పండగలాంటిది...
ఆరోజు వస్తుందంటే చాలు, పిల్లలందరికీ ఎంత ఆనందమో అసలు....ఆ ఒక్క రోజు కోసం నెల రోజులు అందరు పిల్లలు ఎదురు చూసే వాళ్ళు....... అందులో నేను ఒకడిని.
మద్యాన్నం చిట్టి బెల్లు కొట్టగానే ఉరుకులూ పరుగులూ పెడుతూ ఒకడిని ఒకడు నెట్టుకుంటూ మరి పరిగెత్తే వాళ్ళు... ఒక్కొక్కడిలో మొదటిసారి హరివిల్లును చూసిన సంబరం కనిపించేది.

తలుపులు దబాలున తోస్తూ వెళ్లి....”అమ్మ ముందు నాకు ఖార పెట్టు...” అని పిల్లల గోల మొదలయ్యేది...ఆరోజు అన్నం మాటే ఎవడు ఎత్తడు.... ఒకవేళ ఇంకా నాన్న రాక పోతే... నాన్న సైకిల్ బెల్లు ఎప్పుడూ మోగుతుందా అనుకుంటూ గుమ్మం లోనే ఎదురు చూసే వాళ్ళు... ఒకవేళ ఎవరైనా ఏమి కొనకుండా ఊరికే వచ్చారో ఇక అంతే... ఆరోజు వాళ్ళకు మగధీర సినిమా కనపడేది....
మధ్యాన్నం బడికి వెళ్ళాక మా నాన్న అవి తీస్కువచ్చాడు ఇవి తీస్కువచ్చాడు అని..... రెండవ గంట కొట్టేవరకు ఒకటే గోల గోల చేసేవాళ్ళు.... సాయంత్రం మళ్ళి పరుగు.. మద్యాన్నం మిగిలింది తమ్ముడు ఎక్కడ తినేస్తాడో అని...
**************************************************************************

నెల జీతం బతికే జీవితాల్లో నిజంగానే అదొక పండగరోజు.....కుటుంబ ఖర్చులు బరించలేక.. మామూలు రోజుల్లో పిల్లలకు ఏమైనా కొనివ్వాలంటే ఎవరికీ దైర్యం వచ్చేది కాదు.....

ఇలా మా జీవితాల్లో ఒకటిగా కలిసిపోయిన ఎనిమిదవ తేది కొన్ని సంవత్సారాలకి మాయం అయిపొయింది... మా వాళ్ళు పని చేసే బొగ్గు గని మీద జీతాలు ఇవ్వడం మానేసి, బ్యాంకు ఖాతాలోకి జీతం వచ్చేసేది....

ఇప్పుడు పిల్లల్లో ఆ ఉత్సాహం లేదు..ఎదురు చూసే వాళ్ళు లేరు..... జీతాలు వస్తే రోడ్ల మీద పోటీపడి పరిగెత్తే పిల్లల పరుగులూ ఆగిపోయాయి...

ఇప్పుడు జీతాలు కూడా పెరిగాయి.... ఆ తేది కోసం చూసే అవసరం కూడా ఎవరికీ లేదు... ఎప్పుడు పడితే అప్పుడు కావాల్సింది కొనుక్కునే స్థితికి అందరూ వచ్చేసారు....